కీర్తన 105
105
1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.
2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
3ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.
4యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.
5ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
6ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
7ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.
8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,
9ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
10వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,
11కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.
12ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.
13వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా
14వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.
15నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.
16దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు.
17వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు.
18వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది.
19అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.
20రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.
21ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,
22తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు.
23ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు.
24ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు.
25తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు.
26ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు.
27వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు.
28ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.
29ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు.
30వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.
31ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి.
32ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు.
33వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు.
34ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,
35అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి.
36వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు.
37అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు.
38వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు.
39వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.
40వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు.
41శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి.
42ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,
43తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.
44అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.
45వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తన 105: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.