మార్కు 1:30-41

మార్కు 1:30-41 IRVTEL

సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.