యోహాను 8
8
వ్యభిచారంలో దొరికిన స్త్రీ
1యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. 2ఉదయం పెందలకడనే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు. 3అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.
4వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. 5ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. 6ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. 7వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి 8మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు.
9ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. 10యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. 11ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.
పండగ తరువాత ఉపదేశం: లోకానికి వెలుగు యేసే
యోహా 1:9
12మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.” 13అప్పుడు పరిసయ్యులు, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సరైనది కాదు” అన్నారు. 14జవాబుగా యేసు, “నా గురించి నేను సాక్ష్యం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కణ్ణించి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కణ్ణించి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను. 16అయినా నేను ఒంటరిని కాదు. నేను నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది. 17ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా!
18 నా గురించి సాక్ష్యం నేను చెప్పుకొంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు” అన్నాడు. 19వారు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు” అన్నాడు. 20ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ చందా పెట్టె ఉన్నచోట ఈ మాటలు చెప్పాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేదు.
21మరోసారి ఆయన, “నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెతుకుతారు. కానీ మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు” అని వారితో చెప్పాడు.
22దానికి యూదులు, “‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అంటున్నాడేమిటి? ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి?” అని చెప్పుకున్నారు.
23అప్పుడు ఆయన, “మీరు కింద ఉండేవారు. నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు. నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు. 24కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు” అని వారితో చెప్పాడు.
25కాబట్టి వారు “అసలు నువ్వు ఎవరు?” అని అడిగారు. అప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు. “నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే. 26మీ గురించి చెప్పడానికీ మీకు తీర్పు తీర్చడానికీ నాకు చాలా సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను.” 27తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వారు అర్థం చేసుకోలేక పోయారు.
28కాబట్టి యేసు, “మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయననీ తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నాననీ మీరు గ్రహిస్తారు. 29నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచి పెట్టలేదు” అని చెప్పాడు.
30ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే చాలామంది ఆయనలో నమ్మకముంచారు. 31కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు. 33అప్పుడు వారు, “మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. ‘మీరు విడుదల పొందుతారు’ అని ఎలా అంటున్నావు?” అన్నారు.
34దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే. 35బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు. 36కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. 37మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. 38నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినదే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే పనులు చేస్తున్నారు” అని చెప్పాడు.
39దానికి వారు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు. 40దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారుగా. అయితే అబ్రాహాము అలా చేయలేదు. 41మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు” అని వారితో చెప్పాడు. దానికి వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు” అన్నారు.
42యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు. 43నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. 44మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.
45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. 46నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? 47ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.” 48అందుకు యూదులు, “నువ్వు సమరయ వాడివి, నీకు దయ్యం పట్టింది అని మేము చెబుతున్న మాట నిజమే!” అన్నారు.
49అప్పుడు యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు. 50నేను నా పేరు ప్రతిష్టల కోసం వెతకడం లేదు. అలా వెదికే వాడూ, తీర్పు తీర్చే వాడూ వేరే ఉన్నాడు. 51మీకు కచ్చితంగా చెబుతున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు” అని జవాబిచ్చాడు.
52అందుకు యూదులు, “నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము స్పష్టంగా తెలుసుకున్నాం. అబ్రాహామూ, ప్రవక్తలూ చనిపోయారు. ‘నా మాట విన్న వాడు మరణం రుచి చూడడు’ అని నువ్వు అంటున్నావు. 53మన తండ్రి అబ్రాహాము చనిపోయాడు కదా! నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలూ చనిపోయారు. అసలు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు?” అని ఆయనను అడిగారు.
54అందుకు యేసు, “నన్ను నేనే గౌరవించుకుంటే ఆ గౌరవం అంతా ఒట్టిది. ఎవరిని మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారో ఆయనే నా తండ్రి. ఆయనే నన్ను మహిమ పరుస్తున్నాడు. 55మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను. 56నా రోజును చూడడం మీ తండ్రి అబ్రాహాముకు సంతోషం. అతడు దాన్ని చూసి ఎంతో సంతోషించాడు” అన్నాడు.
57అందుకు యూదులు, “నీకింకా యాభై సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రాహామును చూశావా?” అన్నారు. 58దానికి జవాబుగా యేసు “మీతో కచ్చితంగా చెబుతున్నాను. అబ్రాహాము పుట్టక ముందు నుంచీ నేను ఉన్నాను” అన్నాడు. 59అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోహాను 8: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.