యోహాను 19:30-42

యోహాను 19:30-42 IRVTEL

యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది. ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు. వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.