యోహాను 1:1-17

యోహాను 1:1-17 IRVTEL

ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు. సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది. దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది. లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు. తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు. ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము. యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.” ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.