యిర్మీయా 2:1-13

యిర్మీయా 2:1-13 IRVTEL

యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు. యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు? ‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు. ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.” “యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు. కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా? దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు. ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.