యిర్మీయా 12:1-4

యిర్మీయా 12:1-4 IRVTEL

యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు? వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు. వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే. యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు. దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు.