యాకోబు పత్రిక 1:19-26

యాకోబు పత్రిక 1:19-26 IRVTEL

నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు. కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు. తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.