అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు, “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు. నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి. నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను. నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను. భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను. ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను. దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు. నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే. కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి రాజ్యాలన్నీ గుంపులుగా రండి. ప్రజలంతా సమావేశం కండి. వారిలో ఎవరు ఇలాటి సంగతులు చెప్పగలిగారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించ గలిగి ఉండేవారు? తమ యథార్థతను రుజువు చేసుకోడానికి తమ సాక్షులను తేవాలి. లేకపోతే వాళ్ళు విని ‘అవును, అది నిజమే’ అని ఒప్పుకోవాలి. నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించేలా మీరు, నేను ఎన్నుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకంటే ముందు ఏ దేవుడూ ఉనికిలో లేడు, నా తరవాత ఉండడు. యెహోవా అనే నేను నేనొక్కడినే. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడినీ నేనే, రక్షించిన వాడినీ నేనే. దాన్ని గ్రహించేలా చేసిందీ నేనే. మీలో ఇంకా వేరే దేవత ఎవరూ లేరు. నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు.” ఇదే యెహోవా వాక్కు. “నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?” ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మీ విమోచకుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, “మీ కోసం నేను బబులోనుపై దండెత్తి వారు గర్వకారణంగా భావించే ఓడల్లోనే పారిపోయేలా చేస్తాను. మీ పరిశుద్ధ దేవుణ్ణి, యెహోవాను నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని.”
Read యెషయా 43
వినండి యెషయా 43
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 43:1-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు