యెషయా 30
30
తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ
1“తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
2వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. కానీ నా సలహా కోసం చూడరు. ఫరో సంరక్షణ కోసం పాకులాడుతున్నారు. ఐగుప్తు నీడలో ఆశ్రయం కోసం ఆరాటపడుతున్నారు.
3కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.
4ఇశ్రాయేలు ప్రజల అధిపతులు సోయనులో ఉన్నారు. వాళ్ళ రాయబారులు హానేసులో ప్రవేశించారు.
5కానీ వాళ్లకి సహాయం చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం చూసి వాళ్లందరూ సిగ్గుపడి పోతారు. ఉన్నవాళ్ళు సహాయంగానూ, మద్దతుగానూ ఉండకపోగా సిగ్గుగానూ అవమానంగానూ ఉంటారు.”
6దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.
7ఎందుకంటే ఐగుప్తు చేసే సహాయం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను దానికి పనీ పాటా లేకుండా కూర్చునే రాహాబు. అనే పేరు పెడుతున్నా.
8భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు.
9వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.
10దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
11మా దారికి అడ్డం రావద్దు. మా మార్గం నుండి తొలగి పొండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తవద్దు” అని అంటారు.
12కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు ఈ మాటని తిరస్కరించి అణచివేతనూ, మోసాన్నీ నమ్ముకున్నారు. వాటి పైనే ఆధారపడ్డారు.
13కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.
14కుమ్మరి చేసిన మట్టి కుండ పగిలినట్టు ఆయన దాన్ని పగలగొడతాడు. దాన్ని ఆయన విడిచి పెట్టడు. దాని ముక్కల్లో ఒక్క పెంకు కూడా పొయ్యిలో నుండి నిప్పు కణికలను తీయడానికి గానీ కుండలో నుండి నీళ్ళుతోడటానికి గానీ పనికి రాదు.
15ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
16“అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు.
17మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు.
18అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు.
యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.
19ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు.
నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు.
20యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు.
21మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
22వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.
23నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి.
24భూమిని సేద్యం చేయడానికి సహాయం చేసే ఎద్దులూ, గాడిదలూ పార, జల్లెడలతో చెరిగిన ధాన్యాన్ని మేతగా తింటాయి.
25గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి.
26చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది.
యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.
27చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.
28ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది.
29పండగ ఆచరించేటప్పుడు రాత్రి వేళ మీరు పాట పాడుతారు.
ఇశ్రాయేలుకి ఆశ్రయ దుర్గమైన యెహోవా పర్వతానికి ఒక వ్యక్తి పిల్లనగ్రోవి వాయిస్తూ ప్రయాణం చేసేటప్పుడు కలిగే ఆనందం వంటిది వారి హృదయంలో కలుగుతుంది.
30యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు.
31యెహోవా స్వరం విని అష్షూరు ముక్కలైపోతుంది. ఆయన దాన్ని కర్రతో దండిస్తాడు.
32యెహోవా తాను నియమించిన కర్రతో అష్షూరు పై వేసే ప్రతి దెబ్బా, ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తుండగా, తంబురాల, సితారాల సంగీతంతో కలసి ఉంటుంది.
33తగలబెట్టే స్థలం చాలా కాలం కిందే సిద్ధం అయి ఉంది. నిజంగా రాజు కోసం సిద్ధం అయింది. దాన్ని దేవుడు లోతుగా, విశాలంగా చేశాడు. తగలబెట్టడానికి మంటలు, విస్తారంగా కట్టెలు సిద్ధంగా ఉన్నాయి.
యెహోవా శ్వాస గంధక ప్రవాహంలా దాన్ని తగలబెడుతుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 30: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.