కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి. సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం. అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి. హింసల, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు. ఇదెలాగంటే, మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్ఠమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు. కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి. “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.” అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.
చదువండి హెబ్రీ పత్రిక 10
వినండి హెబ్రీ పత్రిక 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీ పత్రిక 10:25-39
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు