ఆది 40

40
యోసేపు, రాజోద్యోగులు
1ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు. 2తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు. 3వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు. 4ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు.
వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత 5వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు.
6ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు. 7అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు. 8అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు. 9అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో “నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది. 10ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి. 11ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు. 12అప్పుడు యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు. 13ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు. 14అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు. 15ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు.
16రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. 17పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు. 18యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు. 19ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు. 20మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు. 21గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు. 22యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు. 23అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 40: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఆది 40 కోసం వీడియో