గలతీ పత్రిక 5:16-26

గలతీ పత్రిక 5:16-26 IRVTEL

నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.