ద్వితీ 4:35-40

ద్వితీ 4:35-40 IRVTEL

అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు. మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు. కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి. అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.