ద్వితీ 4
4
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించాలని ఇశ్రాయేలు ప్రజలకు మోషే అభ్యర్ధన
1కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. వినండి. 2యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు.
3బయల్పెయోరు విషయంలో యెహోవా చేసినదాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడినీ మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉండకుండాా నాశనం చేశాడు. 4యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు. 5యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను. 6ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి “నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు” అని చెప్పుకుంటారు.
7ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? 8ఈ రోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతివిధులు కలిగి ఉన్న గొప్ప జనమేది? 9అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి. 10మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, “నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.”
11అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా 12యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు. 13మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు.
విగ్రహారాధన నిషేధించబడెను
14అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. 15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు. 16కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని, 17ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని, 18నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి. 19ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
20యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు. 21యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ మీ యెహోవా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనీ ఆజ్ఞాపించాడు. 22కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
23మీ దేవుడు యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్తపడండి. 24ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు. 25మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి, ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవా దేవునికి కోపం పుట్టించి, ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు 26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా త్వరలోనే పూర్తిగా నాశనమై పోతారని భూమ్యాకాశాలను మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు.
27అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు. 28అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. 29అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
30ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు 31మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.
యెహోవాయే దేవుడు
32దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు. 33మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా?
34మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా? 35అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు. 36మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.
37ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. 38మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు.
39కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి. 40అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.
శరణు పట్టణాలు
41ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు 42అతడు పారిపోడానికి మోషే తూర్పు దిక్కున, యొర్దాను ఇవతల మూడు పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు. 43అవేవంటే, రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను. 44ఇదీ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం.
45ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు 46యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో, సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో 47మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. 48మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్నీ యొర్దాను ఇవతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్నీ అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సీయోను కొండ వరకూ ఉన్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశాన్ని, 49పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీ 4: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.