“ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు. అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది. మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు. “ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు. అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు? నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు. నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు. మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని స్పష్టంగా చూడ్డానికి దగ్గరికి వచ్చినపుడు ‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి’ అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు. ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.’ “‘మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు?’ అని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు. మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు. ‘నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో నుండి లేవనెత్తుతాడు’ అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మనకు ఇవ్వడానికి జీవవాక్యాలను తీసుకున్నదీ ఇతడే. “మన పూర్వీకులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వారు అతనిని తోసిపుచ్చి తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగారు. అప్పుడు వారు ‘మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అని అహరోనుతో అన్నారు. ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు. అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా ‘ఇశ్రాయేలీయులారా, నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా? మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’
Read అపొస్తలుల కార్యములు 7
వినండి అపొస్తలుల కార్యములు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 7:20-43
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు