అపొస్తలుల కార్యములు 7:17-29

అపొస్తలుల కార్యములు 7:17-29 IRVTEL

అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు. చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది. ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను బాధించాడు. “ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు. అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది. మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు. “ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు. అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు? నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు.

అపొస్తలుల కార్యములు 7:17-29 కోసం వీడియో