ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు. “అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు. ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తరువాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు. “అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు. అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తరువాత వారు బయటికి వచ్చి ఈ స్థలం లో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు. ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక నిబంధనను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు. “ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు. ఆ తరువాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా తీవ్రమైన కరువూ, గొప్ప బాధలూ వచ్చాయి. కాబట్టి మన పితరులకు ఆహారం దొరకలేదు. ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకుని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది. “యోసేపు తన తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వారు మొత్తం 75 మంది. యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు. వారిని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు. చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది. ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను బాధించాడు.
చదువండి అపొస్తలుల కార్యములు 7
వినండి అపొస్తలుల కార్యములు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 7:1-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు