1 పేతురు పత్రిక 3:14-18

1 పేతురు పత్రిక 3:14-18 IRVTEL

మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది. క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.