1 రాజులు 2
2
దావీదు చివరి పలుకులు, మరణం
1దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, 2“మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. 3నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు. 4అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.
5అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు. 6అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు. 7నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు. 8ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను. 9అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.”
10ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు. 11దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు. 12అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.
సొలొమోను పరిపాలన ఆరంభం, దుష్ట శత్రువులను తొలిగించడం
13అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది.
అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి, 14తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు.
ఆమె “ఏమిటో చెప్పు” అంది.
15అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది. 16ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.
17ఆమె “చెప్పు” అంది.
అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
18బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
20ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది.
రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.
21అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.
22అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.
23అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక. 24నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు. 25అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.
26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను” అని చెప్పాడు. 27తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది. 28యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.
29యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి “నీవు వెళ్లి అతని మీద పడి చంపు” అని ఆజ్ఞాపించాడు.
30బెనాయా యెహోవా గుడారానికి వచ్చి “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని యోవాబుతో చెప్పాడు.
అతడు “రాను, నేనిక్కడే చనిపోతాను” అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.
31అందుకు రాజు ఇలా అన్నాడు. “అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి. 32నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు. 33అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”
34కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు. 35రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.
36తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. “నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు. 37నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.” 38అప్పుడు షిమీ “మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను” అని రాజుతో చెప్పాడు.
షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు. 39అయితే మూడు సంవత్సరాల తరవాత షిమీ పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరకి చేరారు. అప్పుడు “నీ మనుషులు గాతులో ఉన్నారు” అని షిమీకి వార్త వచ్చింది. 40షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరకి వెళ్ళి, అక్కడి నుండి తన పనివారిని తీసుకువచ్చాడు.
41షిమీ యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది. 42రాజు షిమీని పిలిపించి అతనితో “నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి, నీచేత ప్రమాణం చేయించాను గదా? పైగా, ‘మీరు చెప్పిందే మంచిది’ అని నీవు కూడా ఒప్పుకున్నావు. 43కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు?” అని అడిగాడు. 44“నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పిస్తాడు. 45అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలం సుస్థిరమౌతుంది” అని షిమీతో చెప్పి 46రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 2: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.