పరమగీతము 4:1-7

పరమగీతము 4:1-7 TELUBSI

నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము. నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.