పరమగీతము 1

1
1సొలొమోను రచించిన పరమగీతము.
2నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును
గాక
నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
3నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది
నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము
కన్యకలు నిన్ను ప్రేమించుదురు.
4నన్ను ఆకర్షించుము
మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము
రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను
నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము
ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె
దము
యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు.
5యెరూషలేము కుమార్తెలారా,
నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను
కేదారువారి గుడారములవలెను
సొలొమోను నగరు తెరలవలెను
నేను సౌందర్యవంతురాలను
6నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను
నా సహోదరులు నామీద కోపించి
నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి
అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
7నా ప్రాణ ప్రియుడా,
నీ మందను నీవెచ్చట మేపుదువో
మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో
నాతో చెప్పుము
ముసుకువేసికొనినదాననై
నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?
8నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా?
మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము
మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను
మేపుము.
9నా ప్రియురాలా,
ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
10ఆభరణములచేత నీ చెక్కిళ్లును
హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
11వెండి పువ్వులుగల బంగారు సరములు
మేము నీకు చేయింతుము
12రాజు విందుకు కూర్చుండియుండగా
నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.
13నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత
సువాసనగలవాడు
14నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని
కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
15నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి
నీ కన్నులు గువ్వ కండ్లు.
16నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు
మన శయనస్థానము పచ్చనిచోటు
మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు
మన వాసములు సరళపు మ్రానులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

పరమగీతము 1: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for పరమగీతము 1