రూతు 2:1-9

రూతు 2:1-9 TELUBSI

నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది. బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు– ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో– నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.