రోమా 7:9-25

రోమా 7:9-25 TELUBSI

ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.

రోమా 7:9-25 కోసం వీడియో