ప్రకటన 2
2
1ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–
ఏడు నక్షత్రములు తన కుడిచేతపట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా 2–నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొ స్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, 3నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. 4అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. 5నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును. 6అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేను కూడ వీటిని ద్వేషించుచున్నాను. 7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.
8స్ముర్నలో ఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము–
మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా 9–నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడ కుము. 10ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది#2:10 అనగా–సాతాను. మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు#2:10 లేక–ప్రాణాపాయము వచ్చినను. నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. 11సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
12పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము– వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా 13–సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. 14అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలోఉన్నారు. 15అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు. 16కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను. 17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
18తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–
అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా 19–నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరి చర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. 20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. 21మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. 22ఇదిగో నేను దానిని మంచము పెట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దాని#2:22 అనేక ప్రాచీన ప్రతులలో–తమ అని పాఠాంతరము. క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, 23దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. 24అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను#2:24 మూలభాషలో–సాతానుయొక్క లోతైనవాటిని. ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పు చున్నదేమనగా–మీపైని మరి ఏ భారమును పెట్టను. 25నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి. 26-27నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి#2:26-27 లేక, గైకొనువానికి. జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరివాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; 28మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. 29సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 2: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.