కీర్తనలు 81

81
ప్రధానగాయకునికి. గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.
1మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి
యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.
2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి
స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
3అమావాస్యనాడు కొమ్ము ఊదుడి
మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు
కొమ్ము ఊదుడి.
4అది ఇశ్రాయేలీయులకు కట్టడ
యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.
5ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు
యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను.
అక్కడ నేనెరుగని భాష వింటిని.
6వారి భుజమునుండి నేను బరువును దింపగావారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.
7ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను
విడిపించితిని
ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని
మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని. (సెలా.)
8నా ప్రజలారా, ఆలకింపుడి నేను మీకు సంగతి
తెలియజేతును
అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల
ఎంత మేలు!
9అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు
అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ
కూడదు.
10ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ
దేవుడనగు యెహోవాను నేనే
నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను.
11అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి
ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.
12కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు
కొనునట్లు
వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని.
13అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల
ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు!
14అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ
ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును.
15యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును.
16అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని
పోషించుదును
కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 81: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి