కీర్తనలు 37:30-40

కీర్తనలు 37:30-40 TELUBSI

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించునువారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవావారికి సహాయుడై వారిని రక్షించునువారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.