సామెతలు 30:1-17

సామెతలు 30:1-17 TELUBSI

దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి –యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.