సామెతలు 30:1-17

సామెతలు 30:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను. నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు. నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు. ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి! “దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు. ఆయన మాటలకు కలపవద్దు, ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు. “యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను; నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి: అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి; దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి, కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి. ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో పేదవాడినైతే దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో. “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు; అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం; భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. “జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు: అవి ఏమనగా పాతాళం, పిల్లలు కనని గర్భం; నీరు చాలు అనని భూమి నీరు చాలు అనని అగ్ని. “తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.

సామెతలు 30:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట. నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు. నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా? దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు. ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు. ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో. దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు. తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది. కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా! దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది. జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి. పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.

సామెతలు 30:1-17 పవిత్ర బైబిల్ (TERV)

యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం: భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది? దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు. యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు. నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను. ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు. కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు. కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు. కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు. ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు. కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి. చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు. తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షిచబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.

సామెతలు 30:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి –యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.