సామెతలు 27:1-14

సామెతలు 27:1-14 TELUBSI

రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును. తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.