సామెతలు 26:13-28

సామెతలు 26:13-28 TELUBSI

సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.