సామెతలు 26:1-16

సామెతలు 26:1-16 TELUBSI

ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు. కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు. –మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు. సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును