సామెతలు 21
21
1యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల
వలెనున్నది.
ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
2ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన
దృష్టికది న్యాయముగానే అగపడును
యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు.
3నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట
బలులనర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
4అహంకార దృష్టియు గర్వ హృదయమును
భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
5శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు
తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
6అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట
ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును
కోరుకొందురు.
7భక్తిహీనులు న్యాయము చేయనొల్లరువారుచేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.
8దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము
పవిత్రుల కార్యము యథార్థము.
9గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె
మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
10భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును
వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
11అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును
జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
12నీతిమంతుడైనవాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును
భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
13దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు
తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
14చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును
ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును.
15న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి
సంతోషకరము
పాపము చేయువారికి అది భయంకరము.
16వివేకమార్గము విడిచి తిరుగువాడు
ప్రేతల గుంపులో కాపురముండును.
17సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును
ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.
18నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు
యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు
19ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము
చేయుటకంటె
అరణ్యభూమిలో నివసించుట మేలు.
20విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును
బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21నీతిని కృపను అనుసరించువాడు
జీవమును నీతిని ఘనతను పొందును.
22జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార
మెక్కును
అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
23నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు
శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
24అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు
అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
25సోమరివాని చేతులు పనిచేయనొల్లవు
వాని యిచ్ఛ వాని చంపును.
26దినమెల్ల ఆశలు పుట్టుచుండును
నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు
దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
28కూటసాక్షి నశించును
విని మాటలాడువాడు సత్యము పలుకును.
29భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును
యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను
ఆలోచనయైనను నిలువదు.
31యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని
రక్షణ యెహోవా అధీనము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 21: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.