సామెతలు 15

15
1మృదువైన మాట క్రోధమును చల్లార్చును.
నొప్పించు మాట కోపమును రేపును.
2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును
బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
3యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును
చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
4సాత్వికమైన నాలుక జీవవృక్షము
దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము
కలుగును.
5మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును
గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
6నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి
భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును
బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
9భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము
నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
10మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును
గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
11పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన
బడుచున్నవి
నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కన
బడును గదా?
12అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు
వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
13సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును.
మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
14బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును
బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.
15బాధపడువాని దినములన్నియు శ్రమకరములు
సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
16నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె
యెహోవాయందలి భయభక్తులతోకూడ కొంచెము
కలిగియుండుట మేలు.
17పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె
ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుటమేలు.
18కోపోద్రేకియగువాడు కలహము రేపును
దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
19సోమరి మార్గము ముళ్లకంచె
యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును
బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
21బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము
వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును
ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల
ఉద్దేశములు దృఢపడును.
23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును
సమయోచితమైన మాట యెంత మనోహరము!
24క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును
25గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును
విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
26దురాలోచనలు యెహోవాకు హేయములు
దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
27లోభి తన యింటివారిని బాధపెట్టును
లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.
28నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు
టకు ప్రయత్నించును
భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
29భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు
నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
30కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు
సంతోషకరము
మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.
31జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి
జ్ఞానుల సహవాసము లభించును.
32శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును
గద్దింపును వినువాడు వివేకియగును.
33యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట
జ్ఞానాభ్యాసమునకు సాధనము
ఘనతకు ముందు వినయముండును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 15: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in