యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించినయెడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడినయెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల, ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను.వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకునిచేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా–ఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసినయెడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుటవలన యెహోవా నీ జనులమధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ– ఆమేన్ అని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములోనుండి పిడికెడు తీసి బలిపీఠముమీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము. రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడినయెడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్యమీద కోపపడినయెడలనేమి,వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.
Read సంఖ్యాకాండము 5
వినండి సంఖ్యాకాండము 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 5:11-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు