సంఖ్యాకాండము 36

36
1యోసేపు పుత్రులవంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రులవంశ ముల పెద్దలు వచ్చి మోషేయెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానులయెదుటను మాటలాడి యిట్లనిరి 2–ఆ దేశమును వంతు చీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞ నొందెను. 3అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రములవారి నెవరినైనను పెండ్లిచేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును. 4కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద#36:4 జూబిలి. సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనినవారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా 5మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను–యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. 6యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా–వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చునుగాని వారు తమ తండ్రి గోత్రవంశము లోనే పెండ్లి చేసికొనవలెను. 7ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను. 8మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను. 9స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను. 10యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. 11సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి. 12వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను. 13యెరికోయొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలును ఇవే.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 36: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for సంఖ్యాకాండము 36