సంఖ్యాకాండము 31

31
1మరియు యెహోవా–మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి. 2తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా 3మోషే ప్రజలతో–మీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికిపోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు 4ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. 5అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలోనుండి పండ్రెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా 6మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతనిచేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. 7యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి. 8చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. 9అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. 10మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. 11వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి. 12తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా 13మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి. 14అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను. 15మోషే వారితో–మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా? 16ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. 17కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; 18పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. 19మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపెట్టినవారును మూడవదినమున ఏడవదినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను. 20మీరు బట్టలన్నిటిని చర్మవస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్యవస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను. 21అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో–యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి యేదనగా 22మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును 23అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 24ఏడవదినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
25మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 26–నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలోనేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి 27యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను. 28మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱె మేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని 29యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. 30మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. 31యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. 32ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 33ఆరులక్షల డెబ్బదియయిదువేల గొఱ్ఱె మేకలును, 34డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును, 35ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును, 36అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱె మేకల లెక్కయెంతనగా మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు. 37-39వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు, వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి. 40-42మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను. సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను. 43మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱెమేకలును 44ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును 45పదునారు వేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే 46ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను 47ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను. 48అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి 49–నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. 50కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా 51మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి. 52సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు. 53ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను. 54అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతులయొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 31: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి