సంఖ్యాకాండము 28

28
1యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2–నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము – నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను. 3మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము–మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. 4వాటిలో ఒక గొఱ్ఱెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను. 5దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను. 6అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి. 7ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. 8ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.
9విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను. 10నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.
11నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను, 12నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలుపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను. 13అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి. 14వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱెపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి. 15నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.
16మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ. 17ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. 18మొదటి దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు 19అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను 20వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. 21ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో ఒక్కొక్క పదియవవంతును 22మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను. 23ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను. 24అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. 25ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.
26మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి యైన పనులేమియు చేయకూడదు. 27యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను 28నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను 29ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును 30మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను. 31నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 28: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for సంఖ్యాకాండము 28