సంఖ్యాకాండము 2

2
1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. 2–ఇశ్రాయేలీయులందరు తమతమపితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమతమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను. 3సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమతమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. 4అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది. 5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. 6అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది. 7అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు. 8అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది. 9యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
10రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. 11అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది. 12అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. 13అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడువందలమంది. 14అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. 15అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది. 16రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగినడవవలెను.
17ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమతమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
18ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. 19అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది. 20అతని సమీపమున మనేష్ష గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. 21అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది. 22అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. 23అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది. 24ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
25దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు. 26అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది. 27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. 28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది. 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. 30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందలమంది. 31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
32వీరు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమతమ సేనల చొప్పున తమతమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది. 33అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు. 34అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లువారు తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 2: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

సంఖ్యాకాండము 2 కోసం వీడియో