సంఖ్యాకాండము 18
18
1యెహోవా అహరోనుతో ఇట్లనెను–నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు 2మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను 3వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లువారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. 4వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను. 5అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు. 6ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు. 7కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.
8మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. 9అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. 10ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. 11మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. 12వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. 13వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును. 14ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. 15మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. 16అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు. 17అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెనుగాని వాటి మాంసము నీదగును. 18అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. 19ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. 20మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారిమధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయులమధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
21ఇదిగో లేవీయులుచేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 22ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లువారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. 23అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైయుందురు. ఇశ్రాయేలీయులమధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 24అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయులమధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.
25మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 26–నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. 27మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను. 28అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలోనుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలోనుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. 29మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను. 30మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను. 31మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరుచేయు సేవకు అది మీకు జీతము. 32మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 18: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.