నెహెమ్యా 8:3-10

నెహెమ్యా 8:3-10 TELUBSI

నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలువబడియుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాయును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి. ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు.