నెహెమ్యా 8:3-10

నెహెమ్యా 8:3-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అతడు నీటిగుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్న విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. వారందరు ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారు. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు. ప్రజలందరికి కనిపించేలా వారందరి కన్నా ఎత్తులో ఎజ్రా నిలబడి గ్రంథాన్ని తెరిచాడు. అతడు గ్రంథాన్ని విప్పగానే ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు. ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు. నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు.

నెహెమ్యా 8:3-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు. ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు. అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు. ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు. ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు. అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.

నెహెమ్యా 8:3-10 పవిత్ర బైబిల్ (TERV)

ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు. ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు. అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు. జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు. తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు. నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”

నెహెమ్యా 8:3-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలువబడియుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాయును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి. ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు.

నెహెమ్యా 8:3-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)