నెహెమ్యా 13
13
1ఆ దినమందువారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో–అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. 2వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. 3కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.
4ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణ యింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసికొని 5నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒక గొప్ప గదిని సిద్ధముచేసి యుంచెను. 6ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని 7యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని 8బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. 9పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని. 10మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని 11నేను అధిపతులతో పోరాడి –దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. 12అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవభాగమును ఖజానాలోనికి తెచ్చిరి. 13నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. 14నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపక ముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.
15ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని. 16తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. 17అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి–విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? 18మీపితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. 19మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. 20వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా 21నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని–మీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమునవారు మరి రాలేదు. 22అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరిం చుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.
23ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. 24వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. 25అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి–మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి 26–ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా? 27కాగా ఇంత గొప్పకీడుచేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని. 28ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని. 29నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. 30ఈలాగునవారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని. 31మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 13: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.