నహూము 3
3
1నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది. 2సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడుచున్నవి. 3రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. 4చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా, 5నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. 6పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమానపరచెదను. 7అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్ద నుండి పారిపోయి–నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. 8సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహుజనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా? 9కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి. 10అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకువేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి. 11నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. 12అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును; 13నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల అడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. 14ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము. 15అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము. 16నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను. 17నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు. 18అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు. 19నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నహూము 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.