మార్కు 8:1-21

మార్కు 8:1-21 TELUBSI

ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందు కాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు – ఏడనిరి. అప్పుడాయన – నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. భోజనముచేసినవారు ఇంచు మించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. అందుకాయన – మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.