మార్కు 7:14-30

మార్కు 7:14-30 TELUBSI

అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి–మీరందరు నా మాట విని గ్రహించుడి. వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి యింటిలోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను– మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె–నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన–ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.

మార్కు 7:14-30 కోసం వీడియో