మార్కు 14:43-65

మార్కు 14:43-65 TELUBSI

వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు – నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు–మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్ర్తములు చింపుకొని–మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరు–మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి. కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు – ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.