మార్కు 14:32-64

మార్కు 14:32-64 TELUBSI

వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన– నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు –నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి–సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చి–మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను. వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు – నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు–మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్ర్తములు చింపుకొని–మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరు–మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.