మార్కు 14:12-42

మార్కు 14:12-42 TELUBSI

పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన –మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–మీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదననెను. అందుకు పేతురు– అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి– నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అతడు మరి ఖండితముగా–నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన– నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు –నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి–సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చి–మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.