మార్కు 10:1-12

మార్కు 10:1-12 TELUBSI

ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.